హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఊరూవాడా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాల అధిపతులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.
